Raghu Rama Krishna Raju: రైతు దినోత్సోవం సందర్భంగా రైతుల బాధలు కూడా అర్థం చేసుకోండి: సీఎం జగన్ కు రఘురామ లేఖ
- నేడు వైఎస్సార్ జయంతి
- రైతు దినోత్సవంగా పాటిస్తున్న వైసీపీ సర్కారు
- సీఎంకు మరో లేఖాస్త్రం సంధించిన రఘురామ
- ధాన్యం బకాయిలు చెల్లించాలని స్పష్టీకరణ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వైసీపీ సర్కారు రైతు దినోత్సవంగా నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రైతుల సమస్యలపై సీఎం జగన్ కు లేఖ రాశారు. రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రైతుల బాధలను అర్థం చేసుకోండి అని విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణ నిమిత్తం వారికి చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పేరును పార్టీ పేరులో మాత్రమే కాదు, వారిని గుండెల్లో కూడా పెట్టుకోవాలని రఘురామ పేర్కొన్నారు.
దేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్న తన వెన్ను విరిగి మూలకు చేరుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ కింద 1.83 లక్షల రైతులకు రూ.1,619 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. కొన్ని నెలలుగా రైతులు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని, తన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని రఘురామ తెలిపారు. కానీ రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇలా చేయడం తగదని హితవు పలికారు.
బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవాలని, అంతేకాకుండా, 25 శాతం విరిగిపోయిన ధాన్యాన్ని కూడా అధికారులు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కానీ అధికారులు 15 శాతం విరిగిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యల నుంచి రైతులను ఆదుకోవాలని సీఎం జగన్ కు తన లేఖలో సూచించారు.