CM Jagan: అమర జవాను జశ్వంత్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నాం: సీఎం జగన్
- జమ్మూకశ్మీర్ లో చొరబాట్లను అడ్డుకున్న సైన్యం
- ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు
- అమరుడైన జశ్వంత్ రెడ్డి
- జశ్వంత్ రెడ్డి స్వస్థలం బాపట్ల మండలం దరివాడ
ఎల్ఓసీ వెంబడి చొరబాట్లను అడ్డుకునే క్రమంలో ఉగ్రవాదులతో పోరాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన జవాను జశ్వంత్ రెడ్డి అమరుడయ్యాడు. 23 ఏళ్ల జశ్వంత్ రెడ్డి స్వస్థలం బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం. 23 ఏళ్ల జశ్వంత్ రెడ్డి ఐదేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి బుల్లెట్ గాయాలతో నేలకొరిగాడు.
దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. బాపట్లకు చెందిన మన జవాను జశ్వంత్ రెడ్డి దేశరక్షణ కోసం కశ్మీర్ లో ప్రాణాలు అర్పించాడని నివాళులర్పించారు. జశ్వంత్ రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం అని కీర్తించారు. జశ్వంత్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం అందజేస్తోందని సీఎం జగన్ తెలిపారు.