Payyavula Keshav: రూ.41 వేల కోట్ల ఖర్చుకు లెక్కలు లేవన్న పయ్యావుల... ఏపీ ఆర్థికశాఖ వివరణ
- వేల కోట్ల వ్యయానికి లెక్కాపత్రాలు లేవన్న పయ్యావుల
- గవర్నర్ కు ఫిర్యాదు
- ప్రభుత్వ లెక్కలు పద్ధతి ప్రకారం జరుగుతాయన్న అధికారులు
- పీడీ ఖాతాల్లో సర్దుబాట్లు జరిగాయని వెల్లడి
రాష్ట్ర ఆర్థికశాఖలో రూ.41 వేల కోట్ల ఖర్చులకు లెక్కలు లేవని పీఏసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రూ.41,043 కోట్ల వ్యయానికి సంబంధించి ఎలాంటి రసీదులు లేవని, వాటిని వివిధ పద్దుల్లోకి మార్చేశారని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ హోదాలో పయ్యావుల కేశవ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై నేడు ఏపీ ఆర్థికశాఖ అధికారులు స్పందించారు.
పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ లెక్కలన్నీ పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కాగ్ పరిశీలనలను తమ దృష్టికి తీసుకురావడం ఆనవాయితీ అని తెలిపారు. సర్దుబాట్లు ఎక్కువగా పీడీ ఖాతాల్లోనే జరిగాయని, పన్ను మినహాయింపు బిల్లులకు జీఎస్టీ సర్దుబాట్లు ఉన్నాయని వివరించారు. ఏడాది చివర్లో పీడీ ఖాతాల నుంచి ఖర్చు కాని నిధులు మురిగిపోతాయని వెల్లడించారు.