Raghu Rama Krishna Raju: సజ్జలను ఏదో ఒక పదవికే పరిమితం చేయండి: సీఎం జగన్ కు రఘురామ లేఖాస్త్రం
- సజ్జల జోడు పదవులపై పంచాయితీ
- ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ కార్యదర్శిగా సజ్జల
- హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన రఘురామ
- త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ
అటు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా, ఇటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డి రెండు పదవుల్లో కొనసాగడంపై ఇటీవల కాలంలో విమర్శలు అధికమయ్యాయి. ముఖ్యంగా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నిశితంగా ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే ఆయన సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. ఇవాళ ఇదే అజెండాతో మరో లేఖ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదో ఒక పదవికే పరిమితం చేయాలని సూచించారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సజ్జల పాత్ర అనే అంశంపై తాను జులై 6న లేఖ రాశానని గుర్తుచేశారు. ఇలాంటిదే ఓ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు చేయగా... ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రచురించాయని తెలిపారు. కానీ, సాక్షిలో ఇది ప్రచురితం కాకపోయి ఉండాలి, లేదా మీరు చదివి ఉండకపోవచ్చు అని సీఎం జగన్ ను ఉద్దేశించి పేర్కొన్నారు.
"నీలం సాహ్నీ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నప్పటికీ ఆమెను ఎస్ఈసీగా ప్రకటించడం నేపథ్యంలో హైకోర్టు ఏమన్నదో గమనించండి. సీఎం సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రజాధనాన్ని ప్రభుత్వ జీతం రూపంలో పొందుతూ, రాజకీయాలు మాట్లాడడం తగునా? అని కూడా నిలదీసింది.
దీనికి సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 19న జరగనుంది. అప్పటిలోగా సజ్జల విషయం తేల్చేయండి. ఎందుకంటే, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నందున రాజకీయాలు మాట్లాడుతున్నట్టు సజ్జలే స్వయంగా అంగీకరించారు. ఇప్పటికే 150కి పైగా న్యాయపోరాటాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎక్కడా సానుకూలతే లేదు. ఇప్పుడీ అంశంలోనూ ఎవరో సామాజిక స్పృహ ఉన్నవాళ్లు పిటిషన్ వేస్తారనిపిస్తోంది. అదే జరిగితే, విపక్షాలకు మరో బలమైన అస్త్రం దొరికినట్టే. అందుకే వీలైనంత త్వరగా సజ్జలను ఒక పదవికే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ రఘురామకృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు.