Y.Srilakshmi: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు.. మెమో దాఖలు చేసే వరకు శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు వద్దన్న తెలంగాణ హైకోర్టు
- గనుల సరిహద్దు వివాదం తేలే వరకు విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టుకు శ్రీలక్ష్మి
- ఊరట కల్పించిన హైకోర్టు
- జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 16వ తేదీకి వాయిదా
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓబుళాపురం గనుల సరిహద్దుల వివాదంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు సీబీఐ కోర్టులో విచారణ నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ షమీమ్ అక్తర్ నిన్న విచారణ చేపట్టారు.
ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయిందని రాతపూర్వకంగా తెలియజేస్తూ, సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించారు. అప్పటి వరకు శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు, జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.