Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం
- ఇప్పటికే రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు
- ఈరోజు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి అల్పపీడనం కూడా తోడు కావడంతో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ విషయానికి వస్తే, ఈరోజు నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లోను... రేపు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది.