K Narayana Swamy: జగన్, షర్మిల మధ్య మనస్పర్థలు లేవు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- విభేదాలు ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు
- జల వివాదాలకు చంద్రబాబు నాయుడే కారణం
- జగన్‌కు ఆంధ్ర, తెలంగాణ అంటూ తేడాలు ఏమీ లేవు
- అందరం తెలుగువారమే... అందరం ఐక్యంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేవని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తుండడం సరికాదని అన్నారు.
ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం తలెత్తిన నేపథ్యంలో వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొందరు అంటున్నారని, అందులో వాస్తవం లేదని ఆయన చెప్పారు.
అసలు జల వివాదాలకు చంద్రబాబు నాయుడే కారణమని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడిని మీడియా అడగాలని ఆయన సూచించారు.
జగన్‌కు ఆంధ్ర, తెలంగాణ అంటూ తేడాలు ఏమీ లేవని చెప్పారు. అందరం తెలుగువారమేనని, అందరం ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వచ్చాక 31.50 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా, ఇళ్లు కూడా కట్టిస్తున్నారని ఆయన చెప్పారు.