Moon: చంద్రుడి కక్ష్యలో ఇళ్లు.. నార్త్ రాప్ కు కాంట్రాక్ట్ ఇచ్చిన నాసా
- రూ.7 వేల కోట్లతో ‘హాలో’ నిర్మాణం
- అక్కడే నివాసం.. అక్కడి నుంచే ప్రయోగాలు
- ఆ గేట్ వే ద్వారానే జాబిలిపై ల్యాండింగ్
చంద్రుడి మీద ప్రయోగాలకు అమెరికా వేగంగా కసరత్తులు చేస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2024లో ‘ఆర్టిమిస్’ ప్రయోగాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. అందు కోసం వ్యోమగాములు, శాస్త్రవేత్తలు చంద్రుడిపై దిగేందుకు, అక్కడే ప్రయోగాలు చేసేందుకు వీలుగా జాబిలి కక్ష్యలో ఆస్ట్రోనాట్ల కోసం గేట్ వేను నిర్మించాలని నాసా అప్పట్లోనే నిర్ణయించింది.
‘హ్యాబిటేషన్ అండ్ లాజిస్టిక్స్ ఔట్ పోస్ట్ (హాలో)’గా పిలుస్తున్న ఆ గేట్ వే నిర్మాణ బాధ్యతలను అమెరికా ఆయుధ తయారీ సంస్థ నార్త్ రాప్ గ్రమ్మన్ కార్ప్ కు నాసా అప్పగించింది. 93.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.7 వేల కోట్లు) విలువైన కాంట్రాక్టును ఇచ్చింది. ఈ విషయాన్ని ఈరోజు నార్త్ రాప్ వెల్లడించింది. అందులో భాగంగా అక్కడకు వెళ్లే ఆస్ట్రోనాట్ల కోసం నివాస సముదాయాల టెస్టింగ్, ఏర్పాటు బాధ్యతలను సంస్థ చేపట్టనుంది. అంతేగాకుండా సోలార్ ప్రొపల్షన్ మాడ్యూల్ (సౌర శక్తితో నడిచే క్రూ క్యాప్సూల్)నూ ఆ సంస్థే అభివృద్ధి చేయనుంది.
కాగా, ఆర్టిమిస్ మిషన్ కోసం ఇప్పటికే 8 దేశాలు నాసాతో జట్టు కట్టాయి. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై అత్యంత పకడ్బందీ ప్రమాణాలతో శాశ్వత నిర్మాణాలను చేపట్టాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. 2024 నవంబర్ లో స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఆర్టిమిస్ ప్రయోగాన్ని చేయనుంది. ఇటు చైనా కూడా చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఓ బేస్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 2030 నాటికి గురు గ్రహం, ఆస్టరాయిడ్ల నుంచి శాంపిళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలుపెట్టింది.