Etela Rajender: టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారు: ఈటల రాజేందర్
- హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు
- ఇతర ప్రాంతాల వారిని ఇక్కడ ఓటర్లుగా చేర్చుతున్నారు
- ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 దొంగ ఓట్లు కూడా నమోదు చేస్తున్నారు
హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. సొంత నియోజకవర్గంలో గెలిచి టీఆర్ఎస్ కు షాకివ్వాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికలో గెలవడం ద్వారా తమకు తిరుగులేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని, దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని అన్నారు. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 డొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులకు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంటలో దొంగ ఓట్లపై ప్రజలు నిఘా పెట్టాలని, ఎవరి ఓటును వారు కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. అధికారులు అధికార పార్టీకి బానిసల్లా పనిచేయవద్దని ఆయన హితవు పలికారు.