DK Shivakumar: కార్యకర్తపై చేయిచేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్... వీడియో వైరల్

Karnataka Congress Chief DK Shivakumar slapped his own party worker
  • మాండ్యాలో నిన్న డీకే శివకుమార్ పర్యటన
  • వీపుపై చేయివేసిన కార్యకర్త
  • ఒక్కటిచ్చుకున్న శివకుమార్
  • చనువిచ్చానని ఇలా చేస్తావా? అంటూ ఫైర్
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఓ కార్యకర్తపై చేయిచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాండ్యాలో ఆయన శుక్రవారం పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ ఎంపీని పరామర్శించేందుకు డీకే శివకుమార్ రాగా, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చాయి. డీకే శివకుమార్ నడుస్తుండగా, ఓ కార్యకర్త ఆయనను ఆనుకుని నడుస్తూ వీపుపై చేయి వేసి తోడ్కొని వెళ్లేందుకు ప్రయత్నించాడు.

అసలే కరోనా కాలం కావడంతో, శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యకర్త తలపై ఒక్కటిచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడి వైఖరితో బిత్తరపోయిన ఆ కార్యకర్త అక్కడి నుంచి ముందుకు వచ్చేశాడు. ఈ సందర్భంగా... "చనువిచ్చింది ఇలా చేయమని కాదు. మనమెక్కడున్నాం... నీ ప్రవర్తనేంటి?" అంటూ శివకుమార్ గట్టిగా అరవడం వీడియో ఫుటేజిలో వినిపించింది.

ఇక, అవకాశం కోసం కాచుకున్న కర్ణాటక బీజేపీ వర్గాలు వెంటనే విమర్శల దాడి మొదలుపెట్టాయి. డీకే శివకుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే జులుం ప్రదర్శించడం తీవ్ర గర్హనీయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.ప్రకాశ్ పేర్కొన్నారు. గతంలో సొంత క్యాడర్ పై ఆయన ఇలాగే ప్రవర్తించారని ఆరోపించారు. జనబాహుళ్యంలో ఎలా నడుచుకోవాలో తెలియని వ్యక్తి ఇవాళ ఓ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు.
DK Shivakumar
Slap
Worker
Congress
Mandya
Karnataka

More Telugu News