Raghu Rama Krishna Raju: గజనీ దండయాత్రల వంటివి చేస్తున్నారు: జగన్‌కు రఘురామ లేఖ
- నాపై లోక్‌సభలో అనర్హత వేటు వేయించేందుకు యత్నాలు
- లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు ఏడుసార్లు విజ్ఞప్తులు
- యదా రాజా తదా మంత్రి అన్నట్లు విజయసాయిరెడ్డి తీరు
- హోదా, రైల్వే జోన్, పోలవరానికి నిధుల కోసం పోరాడాలి
ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు నవ సూచనలు (విధేయతతో) పేరుతో వరుసగా నాలుగో లేఖ రాశారు. తనపై లోక్‌సభలో అనర్హత వేటు వేయించేందుకు గజనీ దండయాత్రల వంటివి చేస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు ఏడుసార్లు విజ్ఞప్తులు చేశారని ఆయన అన్నారు.
యదా రాజా తదా మంత్రి అన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారంటూ చురకలంటించారు. రఘురామపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంటును స్తంభింపజేస్తామంటూ విజయసాయిరెడ్డి ఏకంగా హెచ్చరికలు చేస్తున్నారని ఆరోపించారు. అంత శక్తే గనుక వైసీపీకి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరానికి నిధుల కోసం పోరాడాలని ఆయన సూచించారు.
ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న తనపై అనర్హత వేటు వేయించాలని పదే పదే ప్రయత్నించే బదులు రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం పోరాడేలా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని ఆయన అన్నారు. వైసీపీ నేతలు ఎందుకు పోరాడడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.