Royal Enfield: పలు మోడళ్లపై ధరలు పెంచిన రాయల్ ఎన్ ఫీల్డ్
- ఈ ఏడాది మూడోసారి ధరలు పెంచిన రాయల్ ఎన్ ఫీల్డ్
- 650 ట్విన్స్ పై కొత్త ధరలు అమలు
- గరిష్ఠంగా రూ.6,809 వరకు పెంపు
- మెటియోర్ 350 శ్రేణిలోనూ ధరల పెంపు
ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ పలు మోడళ్ల ధరలు పెంచింది. ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 మోడళ్ల ధరలు పెంచినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు బైకులను ఆటోమొబైల్ వర్గాల్లో 650 ట్విన్స్ గా పిలుస్తారు. ఈ రెండు మోడళ్లలో అన్ని వేరియంట్లకు ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గరిష్ఠంగా రూ.6,809 వరకు ధరలు పెంచినట్టు తెలుస్తోంది.
కాగా, 2021లో రాయల్ ఎన్ ఫీల్డ్ తన మోడళ్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ ఏడాది జనవరిలోనూ, ఏప్రిల్ లోనూ వీటి ధరలు పెంచింది. అంతేకాదు, మెటియోర్ 350 శ్రేణిలోని బైకుల ధరలు కూడా గరిష్ఠంగా రూ.3,146 వరకు పెరిగాయి.