Somireddy Chandra Mohan Reddy: తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి భోజనం చేయడం కాదు... మహారాష్ట్ర, కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులు అడ్డుకోవాలి: సోమిరెడ్డి
- జలవివాదాలపై సోమిరెడ్డి స్పందన
- ఎగువ రాష్ట్రాల డ్యామ్ లపై ఆందోళన
- కృష్ణా నది ఎడారి అవుతుందని హెచ్చరిక
- కేసీఆర్ తో రాజీపడడం సబబు కాదని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జలవివాదాల అంశంపై స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి భోజనం చేయడం కాదు... మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని హితవు పలికారు. ఎగువనున్న రాష్ట్రాల్లో డ్యామ్ లు నిర్మిస్తే కృష్ణా నది ఎడారిగా మారిపోతుందని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ కు రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలేనని అన్నారు. ఇప్పుడు కృష్ణా జలాల కోసం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాజీపడడం సబబు కాదని అన్నారు. కృష్ణా జలాలను సముద్రంలోకి వదిలేస్తుంటే జగన్ చూస్తూ ఊరుకున్నారని సోమిరెడ్డి విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ కు తెలంగాణ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా... ఎంపీలు, ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్టుగా ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.