Samir Banarjee: వింబుల్డన్ లో భారత సంతతి కుర్రాడి టైటిల్ విజయం
- వింబుల్డన్ బాలుర సింగిల్స్ విజేతగా సమీర్ బెనర్జీ
- ఫైనల్లో విక్టర్ లిలోవ్ పై విజయం
- 7-5, 6-3తో జయభేరి
- అమెరికాలో స్థిరపడిన సమీర్ కుటుంబం
అంతర్జాతీయ టెన్నిస్ సింగిల్స్ లో భారత ప్రాతినిధ్యం కానీ, విజయాలు కానీ చాలా తక్కువ. గతంలో అమృత్ రాజ్ సోదరులు, ఆ తర్వాత రామనాథన్ కృష్ణన్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి వంటి వారు అంతర్జాతీయ స్థాయికి వెళ్లినా, సింగిల్స్ లో రాణించింది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, ఓ భారత సంతతి కుర్రాడు వింబుల్డన్ లో ప్రకంపనలు సృష్టించాడు.
అతడి పేరు సమీర్ బెనర్జీ. అమెరికాలో నివసించే భారత సంతతి కుటుంబానికి చెందినవాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ బాలుర విభాగంలో సమీర్ బెనర్జీ సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఇవాళ జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల సమీర్ బెనర్జీ 7-5, 6-3 తో వరుస సెట్లలో అమెరికాకు చెందిన విక్టర్ లిలోవ్ ను చిత్తు చేశాడు. కాగా వింబుల్డన్ లో జూనియర్ విభాగంలో 1954లో రామనాథన్ కృష్ణన్ టైటిల్ గెలిచిన తర్వాత మరే భారతీయుడు ఆ ఘనత సాధించలేకపోయాడు.