Himachal Pradesh: ఒక్కరోజే 300 సెంటీమీటర్ల వాన.. ధర్మశాలను ముంచెత్తిన వరద: వీడియోలు వైరల్
- ఉప్పొంగిన భాగ్సు నాగ్ నాలా
- ప్రమాదకరంగా మాంఝీ నది
- వరదల్లో చిక్కుకున్న వందలాది మంది
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలను వరదలు ముంచెత్తాయి. నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక్కరోజులోనే 300 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. కుంభవృష్టికి కొండల మీది నుంచి వరద ఉప్పొంగింది. ఇటు భాగ్సు నాగ్ నాలా ఉప్పొంగి నగరంలోకి వరద నీరు ముంచెత్తింది.
దీంతో వరద ధాటికి పలు ఇళ్లు కూలిపోయాయి. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు కొట్టుకుపోయాయి. పలు కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా బురద మయంగా మారింది. కాగా, ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. మాంఝీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గుడిసెలు, దుకాణాలు నాశనమయ్యాయి. సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో దారి మూసుకుపోయింది.
కాగా, గత ఐదేళ్లుగా తమకు మంచి ఇళ్లు కట్టించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నా.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు వరదల్లో వారు సర్వం కోల్పోయారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటు భాగ్సు నాగ్ ప్రాంతంలో వందలాది మంది వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు.