Telangana: కరోనా సెకండ్ వేవ్ నుంచి తెలంగాణ బయటపడింది: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
- వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది
- కరోనా తగ్గుముఖం పట్టినా.. అందరూ అప్రమత్తంగా ఉండాలి
- రాష్ట్రంలో వైద్య సౌకర్యాలకు కొరత లేదు
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కు కొరత లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.25 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశామని తెలిపారు.
కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ... ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు హెచ్చరించారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కును కచ్చితంగా ధరించాలని సూచించారు. జనసమూహాలతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పారు.
మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో వైద్యారోగ్య శాఖ అన్నిరకాలుగా సిద్ధమయిందని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలకు కొరత లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ జిల్లాలో కూడా కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని చెప్పారు.