CPI Ramakrishna: వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగును తక్కువ చేస్తోంది: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ
- తీయనైన తెలుగుకు తెగులు పట్టించకండి
- సంస్కృతంపై ప్రేమ ఉంటే మరో అకాడమీ ఏర్పాటు చేసుకోండి
- తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలి
తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు భాష స్థాయిని తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇదే అంశంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తీయనైన తెలుగుకు తెగులు పట్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన అన్నారు. తెలుగు అకాడమీ పేరును మార్చడం తగదని చెప్పారు. సంస్కృత భాషపై అంత ప్రేమ ఉంటే.. దానికి మరో అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగు భాషను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. తెలుగును ఏపీ ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు.
పిల్లల చదువులోకి బలవంతంగా ఆంగ్ల భాషను చొప్పించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలని, మాతృ భాష అభివృద్ధి కోసం తగినన్ని నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.