Mehul Choksi: మెహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు చేసిన డొమినికా కోర్టు
- నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానన్న చోక్సీ
- అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసిన డొమినికా హైకోర్టు
- చోక్సీ తరపున వాదనలు వినిపించిన లాయర్ విజయ్ అగర్వాల్
పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి డొమినికా హైకోర్టులో ఊరట లభించింది. చోక్సీకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది.
అంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోతూ డొమినికా బీచ్ లో చోక్సీ పట్టుబడ్డాడు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ ఆయనపై డొమినికా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, మే 23 నుంచి ఆయన డొమినికా జైల్లో ఉన్నాడు. తాజాగా బెయిల్ లభించడంతో డొమినికా నుంచి అంటిగ్వా అండ్ బార్బుడాకు వెళ్లనున్నాడు.
2018లో ఇండియా నుంచి పారిపోయిన చోక్సీ అప్పటి నుంచి అంటిగ్వాలోనే ఉన్నాడు. తాను నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని, అంటిగ్వాలోని వైద్యుడిని సంప్రదించడం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును చోక్సీ కోరాడు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డొమినికా కోర్టులో చోక్సీ తరపున ప్రముఖ లాయర్ విజయ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.