YS Sharmila: కేసీఆర్ క్షమాపణ చెప్పి, నేలకు ముక్కు రాయాలి: వైయస్ షర్మిల
- దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
- కేసీఆర్ మొద్దు నిద్రను వీడటం లేదు
- దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని... అయినా కేసీఆర్ మొద్దునిద్రను వీడటం లేదని అన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా దున్నపోతుపై వాన పడినట్టు కేసీఆర్ తీరు ఉందని దుయ్యబట్టారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో ఈరోజు ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన కొండల్ కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఆమె పరామర్శించారు. దీక్షను ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడుతూ సీఎంపై విమర్శలు గుప్పించారు.
ఉద్యోగాల నోటిఫికేషన్లు అంటూ ప్రకటన చేసిన కేసీఆర్... ఇదే సమయంలో 50 వేల మంది ఉద్యోగులను పీకేశారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడతామని చెప్పారు.