The 100: క్రికెట్ లో కొత్త ఫార్మాట్ తీసుకువస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
- కొత్తగా 100 బాల్స్ ఫార్మాట్
- ఒక ఇన్నింగ్స్ లో 100 బంతులు
- ఓవర్లకు బదులు సెట్లు
- ఒక సెట్ కు 5 బంతులు
క్రికెట్... ఓ జనరంజకమైన ఆట. ప్రపంచంలో కొన్ని దేశాల్లోనే ఆడుతున్నప్పటికీ ఆదాయంలో మాత్రం మేటి. ఐదు రోజుల టెస్టు క్రికెట్, 50 ఓవర్లతో వన్డేలు, టీ20 క్రికెట్, టీ10 లీగ్ పేరిట అనేక ఫార్మాట్లలో క్రికెట్ ఆడడం తెలిసిందే. అయితే, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్పుడు 'ది 100' పేరిట సరికొత్త ఫార్మాట్ ను పరిచయం చేస్తోంది. ఇందులో ఓ జట్టు 100 బంతులు ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ లో 'ది 100' టోర్నీ జరగనుంది. ఇందుకోసం 8 పురుషుల జట్లు, 8 మహిళల జట్లను ఎంపిక చేశారు.
ఈ నూతన ఫార్మాట్ కు సంబంధించిన విధివిధానాలను ఈసీబీ విడుదల చేసింది. సాధారణంగా ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫార్మాట్లలో ఓవర్లు ఉండడం తెలిసిందే. ఒక ఓవర్ కు 6 బంతులుంటాయి. కానీ, 'ది 100' ఫార్మాట్లో మాత్రం ఓవర్లకు బదులు సెట్లు ఉంటాయి. ఒక సెట్ అంటే 5 బంతులు. సంప్రదాయ క్రికెట్ కు భిన్నంగా ఒక బౌలర్ ఒకేసారి రెండు సెట్లు వేయాల్సి ఉంటుంది. ఒక సెట్ (5 బంతులు) పూర్తయ్యాక... అంపైర్ వైట్ కార్డు చూపిస్తాడు. అంటే ఒక సెట్ పూర్తయిందని అర్థం. ఆపై అదే బౌలర్ మరో ఐదు బంతులు వేయాల్సి ఉంటుంది.
తొలి 25 బంతులకు పవర్ ప్లే వర్తిస్తుంది. పవర్ ప్లే సమయంలో 30 గజాల సర్కిల్ వెలుపల ఇద్దరు ఫీల్డర్లే ఉండాలి. నాకౌట్ మ్యాచ్ ల్లో టై అయితే, ఒక్కో జట్టు ఐదేసి బంతులు ఆడాల్సి ఉంటుంది.