VK Paul: కొన్నిచోట్ల థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న సూచనలు కనిపిస్తున్నాయి: నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
- కరోనా పరిస్థితులపై కేంద్రం ప్రెస్ మీట్
- ప్రపంచవ్యాప్త కేసుల సంఖ్య పెరుగుతోందన్న వీకే పాల్
- థర్డ్ వేవ్ సంకేతాలు వస్తున్నాయని వెల్లడి
- భారత్ లో థర్డ్ వేవ్ ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టీకరణ
దేశంలో కరోనా పరిస్థితులపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో కొన్నిచోట్ల థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3.9 లక్షల పైచిలుకు ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, థర్డ్ వేవ్ తథ్యమని భావిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతానికి భారత్ లో థర్డ్ వేవ్ సంకేతాలు లేవని, అందుకే ఇప్పటినుంచే అప్రమత్తత పాటించడం మేలని వీకే పాల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆరంభంలో సెకండ్ వేవ్ ప్రారంభం కాగా, తొలినాళ్లలో రోజుకు 9 లక్షలు వరకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని వివరించారు. కరోనా థర్డ్ వేవ్ పైనా, కొత్త వేరియంట్లపైనా ప్రధాని మోదీ కూడా హెచ్చరించారని వెల్లడించారు. దేశంలో ఆంక్షలు ఎత్తివేయడం అంటే వైరస్ నిర్మూలన జరిగినట్టు కాదని అన్నారు.