S Jaishankar: సరిహద్దు సమస్యల పరిష్కారానికి సీనియర్ కమాండర్ల సమావేశం... భారత్, చైనా నిర్ణయం
- భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీ
- గంటపాటు సమావేశం
- ఎల్ఏసీ పరిస్థితులపై చర్చ
- ఏకపక్ష మార్పులను అంగీకరించబోమన్న జైశంకర్
సుదీర్ఘకాలంగా వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని భారత్, చైనా భావిస్తున్నాయి. ఇవాళ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఎల్ఏసీ వెంబడి ఏర్పడిన అసాధారణ పరిస్థితులు, పర్యవసానాలను చర్చించారు. వీటిని చక్కదిద్దడానికి సీనియర్ మిలిటరీ కమాండర్ల సమావేశం ఏర్పాటు చేయాలని ఇరువురు నిర్ణయించారు.
దీనిపై కేంద్రమంత్రి జైశంకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో గంటపాటు సమావేశమయ్యానని తెలిపారు. ఎల్ఏసీ పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద ఏకపక్షంగా మార్పులు చేస్తే అంగీకరించబోమని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఇరుదేశాల సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల వద్ద శాంతి, సామరస్యం పూర్తిస్థాయిలో పునరుద్ధరణ, కొనసాగింపు అవసరమని ప్రస్తావించినట్టు జైశంర్ పేర్కొన్నారు.