Andhra Pradesh: అప్పులు పుడితేనే జీతాలైనా, పెన్షన్లైనా, పథకాలైనా: దేవినేని ఉమ
- రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయి
- ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు
- వేల కోట్ల అప్పులను లెక్కల్లో చూపించడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. రోడ్లు గుంతలమయమై చెరువులను తలపిస్తున్నాయని మండిపడ్డారు. 27 నెలలుగా కొత్త రోడ్ల ఊసే లేదని... పాత రోడ్లకు మరమ్మతులు కూడా లేవని దుయ్యబట్టారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి మీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందన్న మాట వాస్తవం కాదా జగన్ గారూ? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని దేవినేని విమర్శించారు. అప్పులు పుడితేనే జీతాలైనా, పెన్షన్లు అయినా, పథకాలైనా అని ఎద్దేవా చేశారు. అప్పులుగా తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలను లెక్కల్లో చూపించరని విమర్శించారు. చేసిన పనులకు బిల్లులు రాక... కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదని చెప్పారు. ఆర్థిక నిర్వహణ, క్రెడిట్ రేటింగ్, చెల్లింపుల పరంగా పాతాళంలోకి వెళ్లిన ఏపీ ఆర్థిక పరిస్థితికి మీ పరిపాలన వైఫల్యం కారణం కాదా? అని ప్రశ్నించారు.