YCP: వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం... వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

YCP Parliamentary party meet at Tadepalli
  • హాజరైన పార్టీ ఎంపీలు
  • దిశానిర్దేశం చేసిన సీఎం జగన్
  • వివరాలు మీడియాకు తెలిపిన విజయసాయి
  • విభజన హామీలపై కేంద్రాన్ని కోరతామని వెల్లడి
  • ప్రత్యేక హోదాపై రాజీపడబోమని స్పష్టీకరణ
త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, నేడు వైసీపీ అధినాయకత్వం తాడేపల్లిలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. పార్టీ ఎంపీలందరూ హాజరైన ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశం అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విభజన హామీలన్నింటిని అమలు చేయాలని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ మొదటి నుంచి పోరాడుతోందని, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ అది కొనసాగుతుందని అన్నారు. ఈ అంశాన్ని ఇప్పటివరకు 12 పర్యాయాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని తేల్చి చెప్పారు.

ఇక, పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తామని, పోలవరం పెండింగ్ నిధుల అంశాన్ని లేవనెత్తుతామని వెల్లడించారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల విషయాన్ని కూడా పార్లమెంటుకు వివరిస్తామని తెలిపారు. కేఆర్ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కూడా కోరతామని విజయసాయి పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోందని, ఇదే అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రానికి స్పష్టం చేస్తామని వెల్లడించారు.
YCP
Parliamentary Party
Parliament
Monsoon Sessions
Andhra Pradesh

More Telugu News