Whatsapp: భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించిన వాట్సాప్
- నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు
- 20 లక్షలకు పైగా ఖాతాల నిలిపివేత
- మే 15 నుంచి జూన్ 15 మధ్య చర్యలు
- నెలవారీ నివేదికలో వాట్సాప్ వెల్లడి
ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా కఠినచర్యలు తీసుకుంది. భారత్ లో 20 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. తన నెలవారీ నివేదికలో వాట్సాప్ ఈ మేరకు పేర్కొంది. హానికరమైన ప్రవర్తనతో కూడిన ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వాట్సాప్ పేర్కొంది. మే 15 నుంచి జూన్ 15 మధ్యన ఈ ఖాతాలను నిలిపివేసినట్టు తెలిపింది.
ఇలాంటి ఖాతాలను ముందే గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, హాని జరిగాక స్పందించడం కంటే, ముందే చర్యలు తీసుకోవడం సబబు అని భావిస్తున్నట్టు తన నివేదికలో తెలిపింది. అవాంఛనీయ ఖాతాలను గుర్తించేందుకు అనువైన సాధనాలను ఏర్పాటు చేశామని వాట్సాప్ వెల్లడించింది. ఇలాంటి ఖాతాలను గుర్తించే ప్రక్రియ మూడు దశలు కలిగి ఉంటుందని, రిజిస్ట్రేషన్, సందేశాలు పంపే సమయం, ఫిర్యాదులు ఆధారంగా స్పందిస్తామని వివరించింది.