Surekha Sikri: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ సురేఖ సిఖ్రి మృతి
- కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు
- నిన్న గుండెపోటు
- 'చిన్నారి పెళ్లికూతురు'తో తెలుగువారికీ పరిచయం
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ లో బామ్మ పాత్ర ద్వారా పేరుతెచ్చుకున్న సీనియర్ బాలీవుడ్ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో నిన్న మరణించారని ఆమె మేనేజర్ తెలిపారు. ఆమె కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. మూడేళ్ల క్రితం షూటింగ్ సమయంలో బాత్రూంలో సురేఖ సిఖ్రి జారిపడడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అనంతరం కోలుకున్నప్పటికీ రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.
సురేఖ సిఖ్రి 1988లో 'కిస్సా కుర్సి కా' సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. మమ్మో, బధాయ్ హో సినిమాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తెలుగులోకి డబ్ అయిన తర్వాత సురేఖ సిఖ్రి తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యారు. సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ అనే సినిమాలో నటించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.