Sharmila: అక్కడి నుంచే పాదయాత్ర షురూ.. రాసిపెట్టుకోండి, నేను ప్రభంజనం సృష్టిస్తా: వైఎస్ షర్మిల
- కాంగ్రెస్ అమ్ముడుపోయిన పార్టీ
- టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి
- తెలంగాణలో మా పార్టీయే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అవుతుంది
- పగలు, ప్రతీకారాల కోసమే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక
తాను త్వరలో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ షర్మిల మరోసారి చెప్పారు. తాను ప్రభంజనం సృష్టిస్తానని, ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అమ్ముడుపోయిన పార్టీ అని, టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో తమ పార్టీయే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అవుతుందని చెప్పుకొచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు అర్థమే లేదని చెప్పారు. పగలు, ప్రతీకారాల కోసమే ఆ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక వచ్చిందని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణలో పలు పార్టీల నేతలు పాదయాత్రలకు సిద్ధమవుతుండడం పట్ల మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. 'హరీశ్ రావు కూడా పాదయాత్రల గురించి విమర్శలు చేస్తున్నారు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? రైతులకు రుణమాఫీ చేస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం?' అని షర్మిల ప్రశ్నలు కురిపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని, రాష్ట్రంలోని అన్ని వర్గాల బాధలను అర్థం చేసుకోవట్లేదని ఆమె విమర్శించారు.