Harish Rao: ఫైన్ పడకుండా కేటీఆర్ తో మాట్లాడతా: హరీశ్
- సిద్ధిపేటను హరితహారంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం
- ప్రతి వీధిలో మొక్కలు నాటాలి
- చెత్త సేకరణ సక్రమంగా జరగాలి
సిద్ధిపేటను చెత్త రహితంగా, హరితహారంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. పట్టణంలోని ప్రతి వీధిలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. డ్రైనేజీలలో వర్షం నీరు తప్ప మురికి నీరు కనిపించకూడదని అన్నారు. సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో చెత్త, హరితహారంపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి వీధిలో చెత్త సేకరణ సక్రమంగా జరగాలని హరీశ్ అన్నారు. చెత్త సేకరణ సక్రమంగా జరగకపోతే ఆ వీధి మున్సిపల్ జవాన్ ను సస్పెండ్ చేయాలని చెప్పారు. ప్రతి మున్సిపల్ ఉద్యోగి, వార్డ్ కౌన్సిలర్, ప్రతి వ్యక్తి చెత్త, చెట్లపై శ్రద్ధ చూపించాలని అన్నారు. ప్రతి గృహిణి, విద్యార్థిని స్వచ్ఛ్ బడికి తీసుకుపోవాలని, చెత్తపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్, మున్సిపల్ ట్యాక్స్ ఒకేసారి చెల్లిస్తే ఫైన్ పడకుండా మంత్రి కేటీఆర్ తో మాట్లాడతానని తెలిపారు.