Devi Sri Prasad: మాట నిలబెట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్... భేష్ అంటూ అభినందించిన కేటీఆర్
- ఇటీవల సోషల్ మీడియాలో శ్రావణి సంచలనం
- అద్భుత గానంతో ఆకట్టుకున్న వైనం
- మంత్రి కేటీఆర్ ఫిదా
- దేవిశ్రీ ప్రసాద్ కు సిఫారసు
ఇటీవల సోషల్ మీడియాలో తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి ఆలపించిన గీతం వైరల్ అయింది. మెదక్ జిల్లా నారైంగి ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయి పేరు శ్రావణి. ఆమె పాట ఆనోటా ఈనోటా పడి మంత్రి కేటీఆర్ వరకు వెళ్లగా, ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు సిఫారసు చేశారు. ఆమె వివరాలు తెలుసుకోవాలని, ప్రతిభను ప్రోత్సహించాలని కోరారు. దాంతో, తప్పకుండా ఆమెకు అవకాశం ఇస్తానని నాడు మాటిచ్చిన దేవి, ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు.
తాను తమిళంలో నిర్వహిస్తున్న 'స్టార్ టు రాక్ స్టార్' కార్యక్రమంలో శ్రావణికి అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని దేవి స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. "కేటీఆర్ సర్... ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మెదక్ జిల్లాకు చెందిన ఆ ప్రతిభావంతురాలైన గాయని శ్రావణిని గుర్తించాం. ఆమెను విమానంలో చెన్నై తీసుకెళ్లాం. 'స్టార్ టు రాక్ స్టార్' కార్యక్రమంలో ఆమె 'లైమ్ లైట్' రౌండ్ లో పాల్గొంది. నిజంగానే ఆమె ఊపేసింది. ఈ ఎపిసోడ్ జీ తమిళ్ చానల్లో జులై 18 ఆదివారం నాడు రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది" అని వివరించారు.
దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. "మీ స్పందన అమోఘం బ్రదర్" అంటూ దేవిశ్రీ ప్రసాద్ కు కితాబునిచ్చారు. అందుకు దేవి ప్రతిస్పందిస్తూ వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 'కేటీఆర్ సర్... మీరు ఎంతో బిజీగా ఉంటూ కూడా ఇలాంటి ప్రతిభావంతులను గుర్తిస్తూ ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుండడం అబినందనీయం' అని పేర్కొన్నారు.