Pulitzer Prize: ఆఫ్ఘన్ దళాలు-తాలిబన్ల మధ్య పోరును చిత్రీకరిస్తూ భారత ఫొటో జర్నలిస్టు మృతి

Reuters Photographer Killed In Kandahar

  • కాందహార్‌లోని స్పిన్ బోల్డక్ జిల్లాలో భీకర పోరు
  • తాలిబన్ల కాల్పుల్లో సిద్దిఖీతోపాటు సైన్యాధికారి మృతి
  • తీవ్రంగా ఖండించిన భారత్

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు చెలరేగిపోతున్నారు. పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాందహార్‌లోని స్పిన్ బోల్డక్ జిల్లాలో ప్రభుత్వ దళాలు, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఆఫ్ఘన్ దళాలతో కలసి వెళ్లిన భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. తాలిబన్ల కాల్పుల్లో సిద్ధిఖీతోపాటు ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన సీనియర్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.

సిద్ధిఖీ మృతి విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత రాయబారి ఫరీద్ ముముండ్ జే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఓ స్నేహితుడిని కోల్పోయానని పేర్కొన్న ఆయన.. సిద్దిఖీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు,  సిద్దిఖీ మృతిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ ఐక్యరాజ్యసమితిలో తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా సిద్దిఖీ మృతిపై విచారం వ్యక్తం చేశారు.

ముంబైకి చెందిన సిద్దిఖీ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ నుంచి 2007లో మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఓ న్యూస్ చానల్‌లో కరస్పాండెంట్‌గా కెరియర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఫొటో జర్నలిస్టుగా మారి రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీలో చేరారు. రోహింగ్యా శరణార్థులపై తీసిన ఫొటోలకుగాను ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డును సిద్దిఖీ అందుకున్నారు.

  • Loading...

More Telugu News