Raghu Rama Krishna Raju: 'పేక‌ముక్క‌లు' అంటూ తెలుగు అకాడ‌మీ చైర్మ‌న్ ల‌క్ష్మీ పార్వ‌తి చేసిన వ్యాఖ్య‌లు వెన‌క్కు తీసుకోవాల్సిందే: ర‌ఘురామ‌

raghu rama slam lakshmi parvati

  • తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడమేంటీ? 
  • రెండు భాష‌లు పేక‌ముక్క‌ల్లా క‌లిశాయంటున్నారు
  • క‌నీసం పాలు, నీళ్ల‌లా క‌లిశాయని అన్నా స‌రిపోయేది
  • తెలుగు భాషా ప్రియులు రోదిస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కొన్ని వారాల పాటు వ‌రుస‌గా లేఖలు రాసిన వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ రోజు మీడియా స‌మావేశంలో మాట్లాడి నేరుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడమేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

సంస్కృత అకాడమీ కావాలంటే దాని కోసం వేరుగా అకాడ‌మీ పెట్టుకోవాల‌ని, అలా ఆ భాష‌ను అభివృద్ధి చేసుకోవాల‌ని తెలుగు భాషాభిమానులు అంటున్నార‌ని రఘురామ కృష్ణరాజు చెప్పారు. అలా కాకుండా తెలుగు, సంస్కృత అకాడమీ అంటూ రెండింటినీ క‌లిపి వ్య‌వ‌హ‌రించ‌డం సరికాద‌ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు.

ల‌క్ష్మీపార్వ‌తి వ‌య‌సులో పెద్ద వార‌ని, అటువంటి వ్య‌క్తి తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చ‌డాన్ని స‌మ‌ర్థిస్తున్నార‌ని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ హోదాలో లక్ష్మీపార్వతి ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు సరికాద‌ని అన్నారు.  

తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఆమె అంటున్నార‌ని, రెండు భాష‌లు పేక‌ముక్క‌ల్లా క‌లిసి పోతాయ‌న్నార‌ని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. క‌నీసం పాలు, నీళ్ల‌లా క‌లిసిపోతాయ‌ని అయినా అన‌లేద‌ని పేక‌ముక్క‌లు అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ర‌ఘురామ అభ్యంతరం వ్య‌క్తం చేశారు. తెలుగు భాషా ప్రియుల రోద‌న‌ను ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అన్నారు.

జూద‌ప్రియుల‌కు త‌ప్ప ఇత‌రులెవ్వ‌రికీ రుచించ‌ని విధంగా ఆమె మాట్లాడ‌డం స‌రికాద‌ని, ఆ ప‌ద ప్ర‌యోగం వ‌ల్ల తెలుగు భాష‌ను ప్రేమించేవారంతా బాధ‌ప‌డుతున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. అంత గొప్ప అకాడ‌మీకి చైర్మ‌న్‌గా ఉన్న ఆమె స్థాయికి ఈ ప‌ద ప్ర‌యోగం త‌గ‌ద‌ని చెప్పారు. పేక‌ముక్క‌లు అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని నేను ల‌క్ష్మీపార్వ‌తిని విన్నవించుకుంటున్నానని రఘురామ అన్నారు.

  • Loading...

More Telugu News