Raghu Rama Krishna Raju: ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
- నదీ యాజమాన్య బోర్డులపై కేంద్రం గెజిట్
- స్వాగతించిన ఎంపీ రఘురామకృష్ణరాజు
- ప్రజలు సంతోషిస్తున్నారని వెల్లడి
- ఆస్తుల పంపకంపైనా జోక్యం చేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికారాలను నిర్వచిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన రాష్ట్ర విభజన చట్టం-2014 ప్రకారం... కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఏపీ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ గెజిట్ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 107 ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల అజమాయిషీలోకి వస్తాయని, తద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య నీటి కోసం అవాంఛనీయ వివాదాలు తలెత్తే అవకాశాలను నిరోధించవచ్చని వివరించారు.
అంతేగాకుండా, తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉందని రఘురామ పేర్కొన్నారు. "రాష్ట్ర విభజన చట్టం ప్రకారం షెడ్యూల్-9 కింద 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. షెడ్యూల్-10 కింద 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిని జనాభా సంఖ్యను అనుసరించి 58:42 నిష్పత్తిలో ఉభయ రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం పంపకానికి నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఆమోదం తెలిపారు.
అయితే, ఈ సంస్థలు, కంపెనీలు ఏడేళ్లయినా ఇంకా పంపకానికి నోచుకోలేదు. వీటికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఏడాది లోపు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వీటి పంపకంపై ఏకాభిప్రాయానికి రాకపోతే, కేంద్రం జోక్యం చేసుకుని, పంపకాల ప్రక్రియను పూర్తిచేయవచ్చు. ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల నడుమ పక్షపాత రహితంగా ఆస్తుల పంపకాన్ని సజావుగా నిర్వహించేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, నిర్దేశిత గడువులోగా ఆ ప్రక్రియ పూర్తిచేసేలా ఆదేశించాలని మిమ్మల్ని కోరుతున్నాను" అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి తన లేఖలో పేర్కొన్నారు.