Suvendu Adhikari: మూడేళ్ల కిందట సువేందు బాడీగార్డు మృతి... కేసును సీఐడీకి అప్పగించిన మమత
- 2018లో సువేందు బాడీగార్డు శుభబ్రత మృతి
- శుభబ్రత భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
- కొద్దిమేర దర్యాప్తు సాగించిన పోలీసులు
- ఈ కేసు తాజాగా సీఐడీకి బదలాయింపు
నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత గతంలో టీఎంసీ నాయకుడన్న సంగతి తెలిసిందే. ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి నమ్మిన బంటుగా వ్యవహరించి, గతేడాది బీజేపీలో చేరారు. ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సువేందు... మమతా బెనర్జీపై విజయం సాధించారు. అయితే, 2018లో సువేందు మంత్రిగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరైన శుభబ్రత చక్రవర్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇప్పుడా కేసును మమత సర్కారు సీఐడీకి అప్పగించింది.
అప్పట్లో, తన భర్త మృతిపై అనుమానాలున్నాయని శుభబ్రత చక్రవర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కొద్దిమేర దర్యాప్తు జరిగింది. తాజాగా ఈ కేసును సీఐడీకి బదలాయించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు షురూ చేసిన సీఐడీ అధికారులు ఇటీవల సువేందు నివాసానికి వెళ్లారు. అయితే సువేందు లేకపోవడంతో వారు వెనుదిరిగారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు బాడీగార్డు మృతిపై ప్రశ్నించారు.
నాడు మమత క్యాబినెట్లో సువేందు రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన పాత మేదీనిపూర్ కాంతిలో నివసించేవారు. ఆర్మ్ డ్ పోలీస్ విభాగానికి చెందిన శుభబ్రత చక్రవర్తి ఆయనకు సెక్యూరిటీ గార్డుగా నియమితుడయ్యాడు. శుభబ్రత... సువేందు నివాసానికి సమీపంలోనే ఉన్న బ్యారక్ లో నివసించేవాడు. అయితే తుపాకీతో కాల్చుకుని చనిపోవడంతో, అతడి భార్య సుపర్ణ పోలీసులను ఆశ్రయించడంతో, కేసు నమోదైంది.