Petrol: కుప్పంలో ఆకాశంలో పెట్రోలు ధర.. లీటరు రూ. 110
- విశాఖలో లీటరు పెట్రోలు ధర రూ. 106.80
- ఒకే నగరంలో రెండు చోట్ల రెండు వేర్వేరు ధరలు
- గ్యాస్ సిలిండర్ ధరల్లోనూ భారీ వ్యత్యాసం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ధరలు ఉన్నాయి. విశాఖపట్టణంలో లీటరు పెట్రోలు ధర రూ. 106.80 ఉంటే, విజయవాడలో రూ.107.63గా ఉంది. ఇక, రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు ధర రూ. 110గా ఉంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోలు ధర రూ. 108.92గా ఉంటే డీజిల్‌ను రూ.100.39కి విక్రయిస్తున్నారు. ఒక్క పెట్రోలే కాదు, వంట గ్యాస్ ధరల్లోనూ ఇలాంటి వ్యత్యాసమే ఉంది. విశాఖపట్టణలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 841గా ఉంటే, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ. 904గా ఉంది.
నిల్వ కేంద్రాల నుంచి దూరానికి అనుగుణంగా అయ్యే రవాణా చార్జీలే ఇందుకు కారణమని చమురు సంస్థలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒకే నగరంలోనూ ధరల్లో వ్యత్యాసం ఉండడం గమనార్హం. గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి, ఆ పక్కనే ఉన్న విజయవాడకు మధ్య పెట్రో ధరల్లో 20 పైసల వరకు వ్యత్యాసం ఉండగా, విజయవాడలోని భవానీపురంలో ఒకలా, బెంజిసర్కిల్‌లో మరోలా ధరలు ఉండడం గమనార్హం.