TDP: ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం... హాజరైన టీడీపీ ఎంపీలు
- రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- హాజరైన గల్లా జయదేవ్, కనకమేడల
- మీడియాతో మాట్లాడిన కనకమేడల
- ప్రత్యేకహోదాపై రాజీనామాలకు సిద్ధమని వెల్లడి
- వైసీపీ ఎంపీల రాజీనామాకు డిమాండ్
రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని వెల్లడించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు, కొవిడ్ పరిస్థితులు, ఎంపీ లాడ్స్ నిధులపై చర్చ జరగాలని కోరామని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజీనామాలకు సిద్ధమని టీడీపీ వైఖరి వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు తమ పదవులు వదిలేసేందుకు సిద్ధమని అన్నారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి రాష్ట్రం కోసం పోరాడాలని కనకమేడల స్పష్టం చేశారు.