Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న వాగువంకలు
- అనేక జిల్లాలో భారీ వర్షాలు
- అనంతపురం, కర్నూలు, గుంటూరు, కడప జిల్లాల్లో వానలు
- లోతట్టు ప్రాంతాలు మునక
- చెరువులను తలపిస్తున్న రహదారులు
- పలుచోట్ల నిలిచిన రాకపోకలు
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల రహదారులపైకి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి, కదిరి వంటి చోట్ల భారీ వర్షం కురిసింది. దాంతో పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది ఉప్పొంగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో చిత్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు విభాగాలు హెచ్చరించాయి.
పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో మిట్టపల్లి బ్రిడ్జి కింద నిర్మించిన తాత్కాలిక రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు, కదిరిలోనూ వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. అడపాల వీధి, నానాదర్గా, నల్లగుట్ట వీధి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రహదారులు చెరువులను తలపించాయి.
ఇక, కడపలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరం జలమయం అయింది. కృష్ణా జంక్షన్, ఓల్డ్ కార్పొరేషన్ ఆఫీస్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు తదితర ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని మురికి కాలువలు కూడా పొంగుతుండడంతో రోడ్లపై మోకాలి లోతున నీరు నిలిచింది. భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
నల్లమల అటవీప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లా మహానంది సమీపంలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో వంతెన పూర్తిగా మునిగిపోగా, మహానంది-బోయలకుంట్ల మెట్ట రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
గుంటూరులో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు నీటమునిగాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. ఏటీ అగ్రహారం, దుర్గానగర్, కామాక్షి నగర్, వెంకటప్పయ్య కాలనీ, హనుమాన్ నగర్ కాలనీల ప్రజలు రాత్రంతా ముంపు నీటిలోనే గడిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.