L Murugan: కుమారుడు మోదీ క్యాబినెట్ లో మంత్రి... తల్లిదండ్రులు ఇప్పటికీ వ్యవసాయ కూలీలు!
- ఇటీవల మోదీ క్యాబినెట్ విస్తరణ
- ఎల్.మురుగన్ కు స్థానం
- సమాచార ప్రసార సహాయమంత్రిగా అవకాశం
- రేకుల ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రులు
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేంద్ర క్యాబినెట్ ను విస్తరించిన సంగతి తెలిసిందే. కొందరికి ఉద్వాసన పలకగా, మరికొందరికి ప్రమోషన్లు లభించాయి. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్.మురుగన్ కు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. మురుగన్ కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి పదవి ఇచ్చారు.
ఇక అసలు విషయానికొస్తే... మురుగన్ ఇప్పుడు కేంద్ర మంత్రి అయినా, ఆయన తల్లిదండ్రులు మాత్రం కూలీలుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. తమ కుమారుడు కేంద్ర మంత్రి అయితే ఏంటి? అతడు మా సాయం లేకుండా స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగాడు... దాంతో మాకేంటి సంబంధం? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
మురుగన్ స్వస్థలం తమిళనాడులోని నమ్మకల్ జిల్లా కోనూర్ గ్రామం. మురుగన్ తల్లిదండ్రుల పేర్లు వరుదమ్మాళ్ (59), లోగనాథన్ (68). వారిది దళిత వర్గంలోని అరుంధతీయార్ సామాజిక వర్గం. పేద కుటుంబం కావడంతో ఇప్పటికీ వరుదమ్మాళ్, లోగనాథన్ ఊర్లోని భూస్వాముల పొలాల్లో కూలి పనులకు వెళుతుంటారు. నేటికీ వారు ఓ రేకుల ఇంట్లోనే నివసిస్తున్నారు. ఓ పాత సైకిల్ తప్ప మరో వాహనం లేదు.
మురుగన్ కు కేంద్ర క్యాబినెట్ లో స్థానం లభించిందన్న సమాచారం వెల్లడి కాగానే, ఆయన తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మీడియా కోనూర్ గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో కూడా వారు ఓ పొలంలో పనిచేస్తూ కనిపించారు. తమ కుమారుడు మోదీ క్యాబినెట్ లో మంత్రి కావడం తమకు గర్వంగా ఉందని, అయితే అందులో తమ ఘనత ఏదీ లేదని తల్లి వరుదమ్మాళ్ నిజాయతీగా చెప్పారు.
కాగా, మురుగన్ కేంద్ర మంత్రి అయిన విషయం కూడా వారికి ఇతర కూలీలు చెబితే తెలిసింది. అయినప్పటికీ వారు తాము చేస్తున్న పని ఆపలేదు. కేంద్రమంత్రి అయిన తర్వాత మురుగన్ భారీ భద్రత మధ్య మందీమార్బలంతో సొంతూరుకు విచ్చేశారు. అయితే వరుదమ్మాళ్, లోగనాథన్ మాత్రం ఏమాత్రం పొంగిపోకుండా, ఎంతో నిరాడంబరంగా కుమారుడ్ని ఇంట్లోకి తీసుకెళ్లారు.
ఇటీవల వారు మీడియాతో మాట్లాడుతూ, తాము ఇప్పటికీ స్వతంత్రంగా జీవించేందుకే ఇష్టపడతామని స్పష్టం చేశారు. ఐదేళ్ల కిందట వారి చిన్న కుమారుడు మృతి చెందగా, కోడలు, పిల్లలను వారే సంరక్షిస్తున్నారు.
కేంద్ర మంత్రి మురుగన్ వ్యక్తిగత విషయాలకొస్తే... ఆయన ఎంతో కష్టపడి విద్యాభ్యాసం చేశారు. చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ కార్యకర్తగా కొనసాగారు. న్యాయవాది అయ్యాక బీజేపీ తరఫున అనేక కేసుల్లో వాదించారు. గతేడాది ఆయనకు తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి అప్పగించారు. ఇప్పుడు ఏకంగా కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. తమిళనాడులో బీజేపీని మరింత బలోపేతం చేయాలన్న ప్రణాళికల్లో భాగంగానే మురుగన్ ను క్యాబినెట్లోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.