East Godavari District: కరోనా భయం.. ఏడాదిన్నరగా స్వీయ గృహ నిర్బంధంలో కుటుంబం!
- తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఘటన
- రేషన్ బియ్యం, తండ్రికి వచ్చే పింఛన్‌తోనే కాలం వెళ్లదీత
- పోలీసులు వెళ్లి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చిన వైనం
- అనారోగ్యానికి తోడు మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళలు
కరోనా మహమ్మారి భయంతో ఓ కుటుంబం ఏడాదిన్నర కాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఇంటికే పరిమితమైంది. రేషన్ బియ్యం, తండ్రికి వచ్చే దివ్యాంగ పింఛన్‌తోనే ఆ కుటుంబం ఇన్నాళ్లూ కాలం వెళ్లదీసింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలోని గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.
ఈ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అవసరాల కోసం తండ్రి, కుమారుడు మాత్రమే బయటకు వస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల వీరి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేసింది. దీంతో వారింటికి చేరుకున్న పంచాయతీ సిబ్బంది ఇంట్లోని మహిళల బయోమెట్రిక్ వేలిముద్ర కావాలని కోరారు. అయితే, తాము బయటకు రాబోమని, తమకు ఇంటి స్థలం ఏమీ వద్దని తేల్చి చెప్పారు. గ్రామ సర్పంచ్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిన్న మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. సరైన పోషకాహారం లేక ఆ ముగ్గురు మహిళలు అనారోగ్యంతోపాటు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.