Pakistan: ఆఫ్ఘన్‌లోని భారత ఆస్తుల ధ్వంసం లక్ష్యంగా.. 10 వేల మంది సాయుధులను పంపిన పాక్
- ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి
- రెచ్చిపోతూ నగరాలను ఆక్రమిస్తోన్న తాలిబన్లు
- వారికి మద్దతుగా పాక్ ఐఎస్ఐ చర్యలు
- ఆప్ఘన్లోని భారత ఆస్తులే లక్ష్యంగా దాడులకు కుట్ర
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండడంతో తాలిబన్ల ప్రభావం మళ్లీ ఎక్కువవుతోన్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా చూసుకుని పాకిస్థాన్ కుట్రలు పన్నుతోంది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి, శాంతి స్థాపన కోసం ఆ దేశంలో గతంలో భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే, అందుకు చిహ్నంగా నిలిచిన ప్రాజెక్టులపై, అక్కడి భారత ఆస్తులపై దాడుల ధ్వంసమే లక్ష్యంగా పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ 10,000 మంది సాయుధులను ఆఫ్ఘనిస్థాన్‌కు పంపింది.
దారుణాలకు పాల్పడుతోన్న తాలిబన్లకు మద్దతుగా వీరు నిలుస్తారు. అక్కడి భారత ఆస్తులు, భవనాలపై దాడులు జరుపుతారు. ఇప్పటికే భారత్ అక్కడి నుంచి దౌత్యవేత్తలను వెనక్కి రప్పించింది. అయినప్పటికీ ఆఫ్ఘన్‌లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. అమెరికా బలగాలు వెనుదిరిగే ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తాలిబన్ ఉగ్రవాదులు ఆ దేశంలోని ప్రధాన నగరాలపై పట్టును పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.