santhosh george kulangara: భారత్ తొలి అంతరిక్ష యాత్రికుడిగా చరిత్ర సృష్టించనున్న సంతోష్ జార్జ్ కులంగర
- వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో వెళ్లనున్న సంతోష్
- యాత్ర కోసం రూ. 1.8 కోట్ల వ్యయం
- తనతో పాటు కెమెరాను తీసుకెళతానన్న సంతోష్
అంతరిక్షంలోకి ప్రయాణించే భారతీయ తొలి రోదసియాత్రికుడిగా కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ కు చెందిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శీరీష పాటు పలువురు దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో... ఈ తరహా యాత్రలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.
తొలి యాత్ర విజయవంతం కావడంతో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మరిన్ని యాత్రలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లేందుకు సంతోష్ జార్జ్ సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర కోసం ఆయన రూ. 1.8 కోట్లు (2.5 లక్షల డాలర్లు) ఖర్చు చేయనున్నారు. దీంతో, రోదసియాత్ర చేసిన తొలి భారత పర్యాటకుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
మరోవైపు సంతోష్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీల తరపున తాను ఈ యాత్రను చేపడుతున్నానని చెప్పారు. అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో తనతో పాటు ఓ కెమెరాను కూడా తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. సంతోష్ గత 24 ఏళ్లలో 130కి పైగా దేశాలను చుట్టొచ్చారు. 'సంచారం' పేరుతో యాత్రా విశేషాలను వివరించే యూ ట్యూబ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1800 ఎపిసోడ్ లను ప్రసారం చేశారు. మరోవైపు, అంతరిక్ష యాత్రను చేపట్టాలని 2007 నుంచి యత్నిస్తున్నారు. దీని కోసం శిక్షణ కూడా తీసుకున్నారు.