Chajju Chaimaar: క్రికెటర్ సురేశ్ రైనా మేనమామ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
- గతేడాది పంజాబ్ లో ఘటన
- థరియాల్ గ్రామంలో దోపిడీదొంగల కిరాతకం
- అశోక్ కుమార్ నివాసంలో బీభత్సం
- అశోక్ కుమార్ మృతి
- నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలు
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనమామ అశోక్ కుమార్ గతేడాది హత్యకు గురైన సంగతి తెలిసిందే. పంజాబ్ లోని థరియాల్ గ్రామంలో అశోక్ కుమార్ నివాసంలోకి చొరబడిన దోపిడీ దొంగలు ఆయన కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో అశోక్ కుమార్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చజ్జూ చైమార్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని చైమార్ తెగకు చెందిన ఈ దోపిడీ దొంగలు పలు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యాకాండలకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ గ్యాంగ్ కు చజ్జూ చైమార్ నాయకుడు. బరేలీ ప్రాంతంలోని బహేదిలో నివసించే చజ్జూ అక్కడ్నించే తన ముఠాను నడిపిస్తుంటాడు. పక్కా సమాచారంతో దాడిచేసిన ఎస్టీఎఫ్ పోలీసులు చజ్జూను అరెస్ట్ చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
అప్పట్లో ఈ హత్య ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సురేశ్ రైనా ఐపీఎల్ ఆడకుండా యూఏఈ నుంచి హుటాహుటీన భారత్ వచ్చేశాడు. తన బంధువుల ఇంట్లో జరిగిన ఘాతుకంపై దర్యాప్తు జరిపించాలంటూ పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కు విజ్ఞప్తి చేశాడు.
2020 ఆగస్టు 19న ఈ దోపిడీ ఘటన జరిగింది. అశోక్ కుమార్ బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆయన భార్య, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడి, ఎట్టకేలకు కోలుకున్నారు.