Peddireddi Ramachandra Reddy: తాగునీటి కోసం ప్రత్యేక గ్రిడ్ ను ఏర్పాటు చేయబోతున్నాం: మంత్రి పెద్దిరెడ్డి
- సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం
- కుప్పంకు సాగునీరు అందించేందుకు జగన్ కృషి చేస్తున్నారు
- సైన్యంలో చేరడానికి యువత ఆసక్తి చూపాలి
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకమని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును గాలేరు-నగరి ప్రాజెక్టుకు అనుంసంధానం చేసి కుప్పం నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ. 550 కోట్ల పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. తాగునీటి కోసం ప్రత్యేక గ్రిడ్ ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈరోజు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ భద్రత కోసం యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పెద్దిరెడ్డి అన్నారు. సైన్యంలో చేరడానికి యువత ఆసక్తి చూపాలని చెప్పారు. యువత భవిష్యత్తు కోసం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లాలో ఏర్పాటు కావడం సంతోషకరమని అన్నారు.