Mahabubabad District: ఎలుకలు కొట్టేసిన రూ. 2 లక్షలలో దక్కింది రూ. 44 వేలే.. అందించిన ఆర్‌బీఐ
- కడుపులో కణతికి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు ఎలుకల పాలు
- నంబర్లు ఉన్న 88 నోట్లను గుర్తించిన తహసీల్దార్
- వీఆర్ఏను తోడుగా ఇచ్చి బాధితుడిని హైదరాబాద్ పంపిన వైనం
కడుపులో కణతికి ఆపరేషన్ చేయించుకునేందుకు దాచుకున్న డబ్బులు ఎలుకలపాలైన ఘటనలో బాధితుడికి రూ. 44 వేలు మాత్రమే దక్కాయి. తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన రెడ్యా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కడుపులో కణతి ఉండడంతో ఆపరేషన్ కోసం రూ. 2 లక్షలు దాచుకోగా, వాటిని ఎలుకలు కొరికిపడేశాయి. దీంతో లబోదిబోమన్న రెడ్యా స్థానిక బ్యాంకులకు వెళ్లగా, వారు హైదరాబాద్‌లోని ఆర్‌బీఐకి వెళ్లమని సూచించారు.
ఈ విషయం తెలిసిన కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలుకలు కొరికిన డబ్బులో నంబర్లు ఉన్న వాటిని గుర్తించాలని తహసీల్దార్ రంజిత్ కుమార్‌ను ఆదేశించారు. నంబర్లు ఉన్న 88 నోట్లను గుర్తించిన తహసీల్దార్ వీఆర్ఏ రాజశేఖర్‌ను తోడుగా ఇచ్చి రెడ్యాను నిన్న ఆర్‌బీఐకి పంపారు. ఆ నోట్లను పరిశీలించిన అధికారులు మొత్తం రూ. 44 వేలు చెల్లించారు.