Pegasus Spyware: పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో మరో సంచలన విషయం వెల్లడి!
- భారత్ లో పెగాసస్ కల్లోలం
- ప్రముఖుల ఫోన్లపై స్పైవేర్ తో నిఘా
- కేంద్రంపై తీవ్ర ఆరోపణలు
- ది వైర్ సంచలన కథనం
- కర్ణాటక రాజకీయాల్లోనూ పెగాసస్ ప్రభావం!
ఇజ్రాయెల్ సంస్థ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ భారత్ లో రాజకీయ కుంపట్లు రగిలిస్తోంది. ఇటీవల ది వైర్ వార్తాసంస్థ వెల్లడించిన కథనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్ వంటి నేతల ఫోన్ నెంబర్లు పెగాసస్ స్పైవేర్ టార్గెట్ లిస్టులో ఉన్నాయని ది వైర్ పేర్కొంది. తాజాగా మరో కథనంలో ఇంకొక సంచలన విషయాన్ని వెల్లడించింది.
2019లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం పెగాసస్ స్పైవేర్ అని తెలిపింది. నాడు కుమారస్వామి సర్కారు కూలిపోగా బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో, మాజీ సీఎంలు కుమారస్వామి, సిద్ధరామయ్య పీఏల ఫోన్ నెంబర్లు, మరికొందరు కర్ణాటక నేతల ఫోన్ నెంబర్లు పెగాసస్ టార్గెట్ లిస్టులో ఉన్నట్టు ది వైర్ వివరించింది. వీరందరిపై పెగాసస్ తో నిఘా వేసిన కారణంగానే నాటి కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కూలిపోయిందని సూత్రీకరించింది. ఈ తాజా కథనం కర్ణాటక రాజకీయాల్లో ఎంతటి కలకలం రేపుతుందో చూడాలి.