Pawan Kalyan: నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బులు ఇవ్వాలి.. లేదంటే రైతుల కోసం పోరాడతాం: పవన్ కల్యాణ్
- రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం
- ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వరా?
- మొత్తం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి
రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వరా? అని ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే రైతుల కోసం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఆ కష్ట జీవులతో ప్రభుత్వం కన్నీళ్లు పెట్టిస్తోందని చెప్పారు. మొత్తం రూ.3 వేల కోట్లకు పైగా వరి పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని వివరించారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి నిరుద్యోగులను ఎలా మోసపుచ్చారో అదే విధంగా రైతన్నలను కూడా నమ్మించి మోసం చేశారని పవన్ కల్యాణ్ విమర్శించారు.