Devineni Uma: జగన్ గారూ, మద్య నిషేధం హామీ అటకెక్కినట్టేనా?: దేవినేని ఉమ
- ఏడాదికి రూ. 2,400 కోట్ల ఆదాయం లక్ష్యం
- 300 కొత్త షాపులు తెరవబోతున్నారు
- నాసిరకం బ్రాండ్ లకు అనుమతి ఇస్తున్నారు
- జగనన్న కాలనీలు సెలయేర్లను తలపిస్తున్నాయి
ఏపీలో మద్యాన్ని నియంత్రించడం కానీ, నిషేధించడం కానీ జరగదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యంగా జగన్ సర్కారు కసరత్తు చేస్తోందని ఆరోపించారు. ఏడాదికి రూ. 2,400 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా కొత్తగా 300 షాపులు తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అన్నారు.
మద్యంపై పన్నులు చూపిస్తూ రూ. 21,500 కోట్ల అప్పులు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అస్మదీయుల జేబులు నింపేలా సొంత నాసిరకం మద్యం బ్రాండ్ లకే అనుమతి ఇస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పిన మద్య నిషేధం అటకెక్కినట్టేనా జగన్ గారూ? అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు.
సెంటు పట్టా జగనన్న నీళ్ల కాలనీలు సెలయేర్లను తలపిస్తున్నాయని దేవినేని ఉమ మండిపడ్డారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో ఇంటి స్థలాలు ఇచ్చారని విమర్శించారు. భూముల కొనుగోళ్లు, మెరకల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మీ నేతల జేబులు నింపేందుకే నివాసయోగ్యం కాని భూముల్లో లేఔట్లు వేశారని విమర్శించారు. ఈ చెరువుల్లో నివాసం ఎలా ఉండాలో చెప్పమంటున్న లబ్ధిదారుల ఆందోళనలు కనబడుతున్నాయా జగన్? అని ప్రశ్నించారు.