Revanth Reddy: కాంగ్రెస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా: రేవంత్ రెడ్డి
- పెగాసస్ వ్యవహారంపై నిరసనలు
- హైదరాబాదులో ఛలో రాజ్ భవన్ చేపట్టిన కాంగ్రెస్
- ఇందిరాపార్క్ వద్ద నిరసన సభ
- ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- భట్టి, జగ్గారెడ్డి, సీతక్క అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో, హైదరాబాదులో రాజ్ భవన్ దిశగా ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క వంటి అగ్రనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. పెగాసస్ స్నూప్ గేట్ వివాదంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.