Clarie Mack: అమెరికాలో అరుదైన కేసు... గుండె కుడివైపున కలిగివున్న అమ్మాయి!
- గుండె ఎడమవైపున ఉండడం సాధారణ విషయం
- షికాగో టీనేజర్ కు కుడివైపున గుండె
- దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన వైనం
- వైద్య పరీక్షల్లో వెల్లడి
సాధారణంగా ప్రతి ఒక్కరికీ గుండె ఎడమవైపున ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అమెరికాకు చెందిన క్లేరీ మాక్ అనే యువతికి గుండె కుడివైపున ఉంది. 19 ఏళ్ల క్లేరీ మాక్ షికాగో నగర వాసి. గత రెండు నెలలుగా దగ్గుతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి వెళ్లి మందులు తీసుకుంది. అయినప్పటికీ నయం కాకపోవడంతో ఊపిరితిత్తుల వ్యాధి అయివుంటుందని వైద్యులు భావించారు. దాంతో ఆమెకు ఎక్స్ రే తీశారు. ఎక్స్ రే చూసిన వైద్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
క్లేరీ మాక్ కు గుండె కుడివైపున ఉండడాన్ని వారు గుర్తించారు. ఈ విషయం తెలిసిన క్లేరీ నమ్మలేకపోయింది. కుడివైపున గుండె ఉండడంతో భయపడిపోయింది. అయితే, అదేమీ ప్రమాదకరం కాదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. కాగా, గుండె కుడివైపున ఉండడాన్ని వైద్యశాస్త్రంలో డెక్స్ ట్రో కార్డియా అంటారని షికాగో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితిని క్లేరీ మాక్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది.