Telangana: టెన్త్లో సీబీఎస్ఈ విధానం.. ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం యోచన!
- సీబీఎస్ఈ విధానంలో స్పల్ప మార్పులు చేసి అమలు
- నవంబరు/ డిసెంబరులో తొలి అర్ధభాగం పరీక్షలు
- రెండు పరీక్షల్లోని మార్కుల ఆధారంగా తుది ఫలితాలు
సీబీఎస్ఈ విధానంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా పదో తరగతిలో దానిని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రెండుసార్లు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్సీ బోర్డు) అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు.
తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించి గ్రేడ్లు కేటాయించొద్దన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే టెన్త్ విద్యార్థులు ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. తొలి ఆరు నెలలకు నవంబరు/డిసెంబరులో, ఆ తర్వాతి ఆరు నెలలకు విద్యా సంవత్సరం చివరిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు ప్రకటిస్తారు.