RBI: సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్న రిజర్వు బ్యాంకు!
- పలు దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న సీబీడీసీ
- అమల్లోకి వస్తే నగదుపై ఆధారపడడం తగ్గుతుందన్న డిప్యూటీ గవర్నర్
- డిజిటల్ కరెన్సీ కోసం పలు చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందన్న టి.రవిశంకర్
పలు దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న డిజిటల్ కరెన్సీపై దృష్టిసారించిన భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలోనే ఆ తరహా కరెన్సీని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ వెల్లడించారు. నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పలు దేశాల్లో టోకు, రిటైల్ విభాగాల్లో సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అమల్లో ఉందని గుర్తు చేశారు.
అలాగే, దేశంలో ప్రైవేటు వర్చువల్ కరెన్సీ (వీసీ)లా ఉపయోగించుకునేందుకు డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ అభివృద్ధి చేస్తోందన్నారు. వీసీ అమల్లోకి వస్తే నగదుపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. కరెన్సీ విలువకు, తయారీ ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరుగుతుందని, సెటిల్‌మెంట్ రిస్క్ కూడా పరిమితంగా ఉంటుందన్నారు. అయితే ఈ కరెన్సీని తీసుకొచ్చేందుకు కాయినేజ్ యాక్ట్, ఫెమా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని రవిశంకర్ తెలిపారు.